జిప్తి శివునూర్‌లో కార్డన్ సర్చ్..
తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్
చేగుంట, జూలై 17: మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, అందులో భాగంగా నార్సింగి మండలం జిప్తి శివునూర్ గ్రామ పరిధిలోని సరోజినీనగర్లో నిర్వహించిన కార్డన్ సెర్చ్లో ఇతర ప్రాంతాలకు చెందిన 15 మంది మహిళలను గుర్తించినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు.
శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...మహిళల అక్రమ రవాణా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసు శాఖ ముందస్తు ప్రణాళిక ప్రకారం కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు చెప్పారు. సెర్చ్ సందర్భంగా అక్కడ నివసిస్తున్న మహిళల వివరాలను నమోదు చేసి, వారి పరిస్థితులను పరిశీలించినట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, ఉపాధి పథకాలతో అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు.
మహిళల అక్రమ రవాణా, బలవంతపు ఉపాధి, అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని ముగ్గురు సీఐలు, పదిమంది ఎస్‌ఐలు, ప్రత్యేక పోలీసు బృందాలు, మహిళా పోలీసులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. పోలీసులు మొత్తం ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను సేకరించారు. మహిళల అక్రమ రవాణా నిర్మూలనకు ఇలాంటి ప్రత్యేక తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.






