10 August, 2026 | 11:27 AM

శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌ సెర్చ్‌

10-08-2026 08:51 AM

అపరిచిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి

రాజాపూర్ కార్డెన్ సెర్చ్ లో మంథని సీఐ బి. స్వామి

రామగిరి, (విజయక్రాంతి): గ్రామాల్లో శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాల నియంత్రణలో భాగంగానే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామని మంథని సీఐ బి. స్వామి అన్నారు. ఆదివారం రామగిరి ఎస్ఐ తాడవేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజాపూర్ గ్రామంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు నేరాల నియంత్రణ, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ  స్వామి మాట్లాడుతూ.. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎవరూ అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని, అనుమానాస్పద కదలికలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తే నేరాలను మరింత సమర్థవంతంగా నియంత్రించవచ్చన్నారు. కార్డన్‌ సెర్చ్‌లో భాగంగా వాహనాలను తనిఖీ చేయగా నంబర్‌ ప్లేట్లు లేని, సరైన ధ్రువపత్రాలు లేని 9 వాహనాలను గుర్తించి సీజ్‌ చేశారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణకు మరింత అవకాశం ఉంటుందని సీఐ వివరించారు.

అలాగే సైబర్‌ నేరాలు, గంజాయి నియంత్రణ, సీసీ కెమెరాల ప్రాధాన్యత, ట్రాఫిక్‌ నిబంధనలు, నూతన చట్టాలు, మూఢనమ్మకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సైబర్‌ నేరానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు ఐకమత్యంతో శాంతియుత వాతావరణంలో జీవించాలని, గ్రామాల్లో శాంతిభద్రతలు నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామగిరి, ముత్తారం ఎస్ఐలు తాడవేని శ్రీనివాస్, రవికుమార్, సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి-కొమురయ్య, ఉపసర్పంచ్ కలవేన శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు..