నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదం..వ్యక్తి మృతి
10-08-2026 09:18 AM
కూసుమంచి, ఆగస్టు 9(విజయక్రాంతి): అతి వేగంగా వస్తున్న కారు, మోటార్ సైకిల్ ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన హట్యతండా సమీపంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సోమ్లా తండాకు చెందిన మాలోతు సఖీయా(65) టీవీఎస్ ఎక్స్ ఎల్ మోటార్ సైకిల్ పై ఖమ్మం- సూర్యాపేట జాతీయ రహదారిలో సూర్యాపేట వైపు కు వెళ్తున్నాడు. వెనక నుంచి వచ్చిన కారు అతివేగంగా మోటార్ సైకిల్ ను ఢీకొట్టింది. దీంతో ఎగిరిపడిన సఖీయా అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న కూసుమంచి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శవపరీక్ష కేంద్రానికి తరలించారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.






