యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలి
రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ రూరల్, (విజయక్రాంతి): పెంట్లవెల్లి మండలం జటప్రోలులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్(Young India Integrated Residential School) నిర్మాణ పనులను రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పరిశీలించారు. పాఠశాల నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచి, పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యార్థులకు సమానంగా నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.విద్యతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ఆధునిక వసతులు, ప్రయోగశాలలు, క్రీడా సదుపాయాలతో ఈ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో బాల, బాలికలకు ప్రత్యేకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ విజన్ అని తెలిపారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడం ద్వారా తెలంగాణ విద్యార్థులను భవిష్యత్ పోటీ ప్రపంచానికి సిద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జటప్రోలు యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.






