2 April, 2026 | 2:07 AM

మంట పుట్టిస్తున్న వంట గ్యాస్

02-04-2026 12:00 AM
  1. మండుటెండల్లో బారులు తీరిన వినియోగదారులు
  2. కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న హోటల్ యజమానులు

వాంకిడి, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): మండలంలో వంట గ్యాస్ కోసం సామాన్యుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారుతు న్నాయి. గత నెల రోజులుగా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఈ క్రమం లో మంగళవారం వాంకిడి మండల కేంద్రంలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సిలిండర్ల కోసం ఎన్ని రోజులు నిరీక్షించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు ఏజెన్సీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

ఎండలో గంటల తరబడి నిరీక్షణ..

మండలంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బుకింగ్ చేసుకొని 15 రోజులు గడుస్తున్నా గ్యాస్ డెలివరీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విసిగిపో యిన జనం సిలిండర్లతో నేరుగా ఏజెన్సీ వద్దకు చేరుకొని క్యూ కడుతున్నారు. మండుటెండల్లో గంటల తరబడి వేచి చూస్తే తప్ప గ్యాస్ లభించని పరిస్థితి నెలకొంది.

ఏజెన్సీ కార్యాలయానికి వెళ్తే సిబ్బంది బుకింగ్ మెసేజ్లను చూసి ఒక నిర్దిష్ట తేదీతో కూడిన చీటీ ఇస్తున్నారని వినియోగదారులు చెబుతు న్నారు. ఆ తేదీన స్టాక్ పాయింట్ వద్దకు ఖాళీ సిలిండర్లతో వెళ్తేనే సిలిండర్ ఇస్తామని చెబుతున్నారని తెలిపారు. దీంతో వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్యాస్ కోసం కొందరు తమ ఉద్యోగాలకు సైతం సెలవులు పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు.

కట్టెల పొయ్యే దిక్కు..

మండలంలో గత కొద్ది రోజులుగా నెలకొన్న కమర్షియల్ గ్యాస్ కొరత వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహించడం యజమానులకు భారంగా మారింది. సిలిండర్లు సకాలంలో అందుబాటులో లేకపోవ డంతో అనేకమంది వ్యాపారులు తమ హోటళ్లను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధునిక కాలంలో గ్యాస్ పొయ్యిలపై వేగంగా వంటలు చేయాల్సిన చోట గత్యంతరం లేక మళ్లీ కట్టెల పొయ్యిలను ఆశ్రయిం చాల్సి వస్తోంది.

పొగసెగలను భరిస్తూ వంటలు సిద్ధం చేయడం హోటల్ కార్మికులకు కష్టతరంగా మారింది. ఒకవైపు పెరుగుతున్న ఖర్చులు, మరోవైపు గ్యాస్ దొరకకపోవడంతో హోటల్ యజమానులు దిక్కుతో చని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మండలంలో మరిన్ని హోటళ్లు మూతపడే ప్రమాదం ఉం దని, తక్షణమే అధికారులు స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.