25 July, 2026 | 10:08 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

ఖాజీ నియామకంపై హుస్నాబాద్‌లో వివాదం

25-07-2026 09:04 PM

అదనపు ఖాజీ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలి

మజీదు కమిటీ డిమాండ్

హుస్నాబాద్, జూలై 25: హుస్నాబాద్ నియోజకవర్గానికి అదనపు ఖాజీ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని హుస్నాబాద్ టౌన్ ఆలంఘీర్ మసీదు కమిటీ అధ్యక్షుడు వహాబ్ అన్వర్ డిమాండ్ చేశారు. శనివారం హుస్నాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లాలో చేపట్టిన అదనపు ఖాజీ నియామక ప్రక్రియపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిద్దిపేట డివిజన్ ఆర్డీఓ సదానందం విచారణ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ కట్టా హైమావతి మైనారిటీ సంక్షేమ శాఖకు ఏకపక్ష నివేదిక పంపారని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా పొందిన వివరాల ప్రకారం ఆ నివేదికలో అనేక లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అదనపు ఖాజీగా నియమితుడైన వ్యక్తి సమర్పించిన విద్యార్హతల ధ్రువపత్రాలపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. 2008లో డిగ్రీ, 2009లో ఎస్‌ఎస్‌సీ, 2010లో పీజీ సర్టిఫికెట్లు సమర్పించడం విద్యా క్రమంపై సందేహాలకు తావిస్తోందని పేర్కొన్నారు. అలాగే సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసులు, హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గానికి అదనపు ఖాజీగా రూహుల్ అమీన్‌ను నియమించిందని విమర్శించారు.

ఈ నియామకంపై వక్ఫ్ బోర్డుకు ఫిర్యాదు అందిందని, అనంతరం హైదరాబాద్ వక్ఫ్ బోర్డు సంబంధిత వ్యక్తికి అధికారిక పుస్తకాలు (బుక్‌లెట్లు) జారీ చేయవచ్చా లేదా అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖను వివరణ కోరిందని తెలిపారు.నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఖాజీ వంటి గౌరవప్రదమైన ధార్మిక పదవికి నియమించడం సమంజసం కాదని పేర్కొంటూ, ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ సమర్పించిన విచారణ నివేదికపై పారదర్శక విచారణ నిర్వహించి, అదనపు ఖాజీ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని వహాబ్ అన్వర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు ముస్లిం ప్రముఖులు, మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.