అన్నమాట తప్పని ఆ నాయకుడు.. నెల నెల ఆసరా తప్పనిసరిగా అందిస్తున్నాడు
వెళ్ళుట్ల గ్రామ సర్పంచ్ పటేల్ సాయిలు
6 నెలలుగా నిరుపేద కుటుంబానికి నిరంతర సహాయం
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నారు వెల్లుట్ల గ్రామ సర్పంచ్ పటేల్ సాయిలు. గ్రామానికి చెందిన నిరుపేద, అంగవైకల్య బాధితుడు మంగలి రమేష్ కుటుంబానికి ఆయన గత ఆరు నెలలుగా నిరంతరంగా ఆర్థిక సహాయం అందిస్తూ “అపర దాన కర్ణుడు”గా గుర్తింపు పొందుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ రమేష్ దయనీయ పరిస్థితిని గమనించిన సర్పంచ్, ఆయనకు అండగా నిలవాలని సంకల్పించారు.
అంగవైకల్యంతో బాధపడుతున్న రమేష్ భార్య ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించగా, ఆయన తన మూడేళ్ల కుమారుడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సాయం అందక పూట గడవడమే భారంగా మారిన ఈ కుటుంబ పరిస్థితి చూసి చలించిన సాయిలు, తాను గెలుపొందిన అనంతరం ప్రభుత్వం నుంచి పింఛన్ మంజూరయ్యే వరకు ప్రతి నెలా రూ. 2,000 ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.
హామీకి కట్టుబాటు – ఆరు నెలలుగా అండగా
ఇచ్చిన మాట ప్రకారం, గత జనవరి నెల నుంచి ఇప్పటివరకు ఆరు నెలలుగా నిరంతరాయంగా రమేష్‌కు తన సొంత సంపాదన నుంచి ప్రతి నెల రూ. 2,000 ఆర్థిక సహాయం అందజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నేడు గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ పెద్దల సమక్షంలో ఈ నెలకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని అందజేశారు.
గ్రామస్తుల ప్రశంసలు
పదవి వచ్చిన తరువాత హామీలను మరచిపోతున్న నేటి రాజకీయ పరిస్థితుల్లో, ఒక నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తూ ఆరు నెలలుగా సహాయం అందిస్తున్న సర్పంచ్ పటేల్ సాయిలు చర్యలను వెల్లుట్ల గ్రామస్తులు హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. ఆయన సేవా భావం ఇతర ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






