నూతన కనిష్ఠస్థాయి 85.79 వద్ద ముగింపు
ముంబై, జనవరి 3: రూపాయి క్షీణబాటలోనే పయనిస్తున్నది. డాలర్ బలోపేతం కావడం, ఇతర వర్థమాన కరెన్సీలు క్షీణించడంతో రూపాయి మరో నూతన కనిష్ఠస్థాయి వద్ద ముగిసింది. శుక్రవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో (ఫారెక్స్)డాలరు మారకంలో రూపాయి విలువ మరో 4 పైసలు క్షీణించి 85.79 వద్ద ముగిసింది. డిసెంబర్ 27న రూపాయి 85.80 ఆల్‌టైమ్ కనిష్టస్థాయికి పడిపోయినప్పటికీ, ఆ రోజున రూపాయి విలువ 85.53 వద్ద ముగిసింది. కానీ 85.79 స్థాయి వద్ద ముగియడం ఇదే ప్రధమం.
డాలర్ బలోపేతం
పలు దేశాల కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ బలపడిందని, ఇదే పటిష్ఠత కొత్త ఏడాదిలోనూ కొనసాగుతున్నదని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు. వడ్డీ రేట్ల కోతలపై ఫెడరల్ రిజర్వ్ అంచనాలు తగ్గడం, ట్రంప్ పాటించబోయే వాణిజ్య విధనాలపై అంచనాలతో డాలర్ ఇండెక్స్, యూఎస్ 10 ఏండ్ల బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయని, దీనితో రూపాయి విలువ క్షీణిస్తున్నదని ట్రేడర్లు తెలిపారు.
డాలర్ పటిష్ఠతను తెలిపే డాలర్ ఇండెక్స్ తాజాగా కీలకమైన109 స్థాయిని అధిగమించింది. డాలర్ బలం, క్రూడ్ ధరల పెరుగుదల, దిగుమతిదార్ల నుంచి డాలర్ల డిమాండ్ తదితర అంశాలతో సమీప భవిష్యత్తులో రూపాయి బలహీనంగానే ట్రేడవుతుందని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. సమీప భవిష్యత్తులో డాలర్/రూపీ పెయిర్ 85.60 రేంజ్‌లో కదలవచ్చని అంచనా వేశారు.