ముంబై, జనవరి 3: విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ నుంచి పెట్టుబడులు తరలిస్తున్న నేపథ్యంలో రిజర్వ్‌బ్యాంక్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు 8 నెలల కనిష్ఠస్థాయికి తగ్గాయి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం డిసెంబర్ 27తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు మరో 4.112 బిలియన్ డాలర్లు తగ్గి 640.279 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.
ఫారెక్స్ సెప్టెంబర్ చివరినాటి రికార్డు గరిష్ఠస్థాయి 704.885 బిలియన్ డాలర్ల నుంచి ఇప్పటివరకూ 65 బిలియన్ డాలర్లు క్షీణించాయి. అంతక్రితం డిసెంబర్ 20తో ముగిసి న ఒక్కవారంలోనే 8.478 బిలియన్ డాలర్లు తరలిపోయాయి. గత కొద్దివారాలుగా రూపా యి పతనాన్ని నిరోధించడానికి రిజర్వ్‌బ్యాంక్ విరివిగా డాలర్లను విక్రయించడం కూడా నిల్వల తగ్గుదలకు కారణమని విశ్లేషకులు చెప్పారు.
తాజాగా డిసెంబర్ 27తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 4.641 బిలియన్ డాలర్లు క్షీణించి 551.921 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు.
పెరిగిన బంగారం నిల్వలు
ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు మాత్రం సమీక్షావారంలో 541 మిలియన్ డాలర్లు పెరిగి 66.268 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 12 మిలియన్ డాలర్ల తగ్గుదలతో 17.873 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్లు రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు స్థిరంగా 4.217 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.