calender_icon.png 10 January, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల వెల్లువ

04-01-2025 12:38:49 AM

సెన్సెక్స్ 720 పాయింట్లు డౌన్

ముంబై, జనవరి 3: కొత్త ఏడాది తొలి రెండు రోజులూ ఇన్వెస్టర్లకు భారీ లాభాల్ని తీసుకొచ్చిన స్టాక్ మార్కెట్ మూడవరోజైన శుక్రవారం వెనకడుగు వేసింది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. పాజిటివ్‌గా ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ కొద్ది నిముషాల్లోనే నెగిటివ్‌లోకి జారీపోయింది. ఇంట్రాడేలో 833 పాయింట్లు క్షీణించి 79,109 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది.

చివరకు 720  పాయింట్ల నష్టంతో  79,223 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 23,976 పాయింట్ల వద్ద కనిష్టస్థాయిని తాకిన అనంతరం చివరకు 184 పాయింట్ల క్షీణతతో 24,004 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అదేపనిగా క్షీణిస్తున్న రూపాయి మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందన్నారు. బీఎస్‌ఈలో ట్రేడయిన మొత్తం షేర్లలో 2,345 స్టాక్స్ పెరగ్గా, 1,574 స్టాక్స్ తగ్గాయి. ఈ  వారం మొత్తంమీద  మాత్రం సెన్సెక్స్ 524 పాయింట్లు, నిఫ్టీ 191 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. 

క్యూ3 ఫలితాల ముందు జాగ్రత్త

గత వరుస రెండు రోజుల్లో సెన్సెక్స్ 1,800 పాయింట్లు, నిఫ్టీ 550 పాయింట్లు ర్యాలీ జరిపినందున, వచ్చేవారం క్యూ3 ఫలితాల సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఐటీ షేర్లను విక్రయించి, లాభాల్ని స్వీకరించారని విశ్లేషకులు తెలిపారు.

యూఎస్ డాలర్ పటిష్టత, భారత స్టాక్స్ అధిక విలువలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గించబోదన్న అంచనాలు మార్కెట్ క్షీణతకు కారణమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.

డొనాల్డ్ ట్రంప్ యూఎస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే సమయం సమీపిస్తున్నందున, అంతర్జాతీయ పరిణామాల్ని గమనిస్తూ ఇన్వెస్టర్లు జాగురూకతతో వ్యవహరిస్తారని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు. 

జొమాటో టాప్ లూజర్

 సెన్సెక్స్ ప్యాక్‌లో కొత్తగా ప్రవేశించిన జొమాటో అన్నింటికంటే అధికంగా 4.2 శాతం క్షీణించింది. మారుతి సుజుకి షేరు 6 శాతం ర్యాలీ జరిపింది. ఈ షేరు వరుస రెండు రోజుల్లో 9 శాతంపైగా లాభపడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, లార్సన్ అండ్ టుబ్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐటీసీలు 3.5 శాతం వరకూ నష్టపోయాయి.

మరోవైపు టాటా మోటార్స్, నెస్లే, టైటాన్, హిందుస్థాన్ యూనీలీవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 శాతం వరకూ లాభపడ్డాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా ఐటీ ఇండెక్స్ 1.42 శాతం తగ్గింది. టెక్నాలజీ ఇండెక్స్ 1.13 శాతం, బ్యాంకెక్స్ 1.07 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.06 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 0.87 శాతం చొప్పున తగ్గాయి. ఎనర్జీ, టెలికమ్యూనికేషన్, కన్జూమర్ డ్యూరబుల్స్, యుటిలిటీస్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.02 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.33 శాతం చొప్పున తగ్గాయి.

తిరిగి ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు

 విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) తిరిగి భారీ అమ్మకాలకు పాల్పడ్డారు.శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ.4,224 కోట్ల నికర అమ్మకాలు జరిపినట్లు పెట్టినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  నాలుగు వరుస ట్రేడింగ్ సెషన్లలో రూ.9,000 కోట్లు వెనక్కు తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు గురువారం మాత్రం రూ.1,506 కోట్ల పెట్టుబడి చేసినప్పటికీ, తిరిగి పెద్ద ఎత్తున అమ్మకాలు జరపడం గమనార్హం.