11 March, 2026 | 9:34 AM

విద్యాసంస్థలు, వసతిగృహాల్లో కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కావొద్దు

11-03-2026 12:03 AM

జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 10, (విజయక్రాంతి): జిల్లాలోని విద్యాసంస్థలు, వసతి గృహాల్లో కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్తో కలిసి జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓలు, ఆర్సీవోలు, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా విద్యాసంస్థల్లో ఆహార భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాలయాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై పూర్తి బాధ్యత సంబంధిత ఆర్సీవోలు, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులదేనని స్పష్టం చేశారు. కలుషిత ఆహార ఘటనలపై కేవలం వంటవారు లేదా వార్డెన్లపై చర్యలు తీసుకోవడం సరిపోదని, ఇటువంటి ఘటనలు పునరావృతమైతే సంబంధిత ఆర్సీవోలు, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా స్థాయి అధికారులపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇటీవల మణుగూరులోని మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన కలుషిత ఆహార ఘటన దురదృష్టకరమన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కొందరు విద్యార్థినులు తమ తల్లిదండ్రులు ఇంటి నుండి తీసుకువచ్చిన బిర్యానీ, మాంసాహార పదార్థాలు తీసుకోవడంతో అస్వస్థతకు గురైనట్లు వెల్లడైంది. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో ఏర్పాటు చేసిన ఆహార భద్రత కమిటీ సభ్యులు ముందుగా వండిన ఆహారాన్ని స్వయంగా రుచి చూసిన తరువాత మాత్రమే విద్యార్థులకు వడ్డించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యమైనది, పరిశుభ్రమైనది, పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని విద్యాసంస్థలు, వసతి గృహాలను తరచూ సందర్శిస్తూ ఆహార నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ అంశాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.