5 August, 2026 | 2:41 AM

కాజీపేట బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

05-08-2026 01:45 AM

బిజెపి జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి డిమాండ్

హనుమకొండ, ఆగస్టు 4 (విజయ క్రాంతి) : కాజీపేట నూతన బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కాజీపేట లో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి  మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా కాజీపేట బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయని, గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పనులను సకాలంలో పూర్తి చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు.

బ్రిడ్జి పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసి, నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పనుల జాప్యం కారణంగా ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ నిధులను విడుదల చేసి పనులను వేగవంతం చేయకపోతే, కాజీపేట బ్రిడ్జి సమస్య పరిష్కారం అయ్యే వరకు బీజేపీ ఆధ్వర్యంలో నిరంతర ఆందోళనలు కొనసాగిస్తామని సంతోష్ రెడ్డి హెచ్చరించారు.

ఈ రాస్తారోకో కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు పద్మ  డా. కాళీ ప్రసాద్ పులి సరోత్తం రెడ్డి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి, బి సిమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందగట్ల సత్యనారాయణ, జన్ను మధు, కాసర్ల రుత్విక్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అర్చన, ఆకుల శ్రీకాంత్ , నర్మేట శ్రీనివాస్, అరన్య రెడ్డి,ఎం.డి. జరీనా,కొండం రవీందర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, పిట్టల ధనలక్ష్మి, బొమ్మసాని అనిల్, శ్రీరామ్ రెడ్డి, మీడియా ఇన్చార్జ్  తిరుపతి నాయక్,వివిధ డివిజన్ల అధ్యక్షులు, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.