21 May, 2026 | 2:40 AM

మైనర్‌తో కానిస్టేబుల్ రెండో పెళ్లి

21-05-2026 12:00 AM
  1. బాలికను మభ్యపెట్టి వివాహం 
  2. అర్ధరాత్రి వేళ సాగిన వివాహ తంతు
  3. పోలీస్ శాఖకే మాయని మచ్చలా కానిస్టేబుల్ వ్యవహార శైలి
  4. సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి

హుజూర్‌నగర్, మే 20 (విజయక్రాంతి): మాటలతో మభ్యపెట్టి ఓ బాలికను పెళ్లి చేసుకుని పోలీస్ శాఖకు మాయని మచ్చలా మారాడు ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజూర్‌నగర్ మండల పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన నాయిని అనిల్ కుమార్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అనిల్ కుమార్‌కు గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది.

అయిన కూడా అనంతగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో ప్రేమ వ్యవహారం నడిపాడు. విషయం తెలిసి బాలిక తల్లిదండ్రులు ముందలించడంతో.. బాలిక తల్లిదండ్రుల అనుమతితో ఈ నెల 9న అర్ధరాత్రి వివాహం చేసుకున్నాడు. ఈ విషయమై ఐసీడీఎస్ హుజూర్‌నగర్ సెక్టార్ ఇంచార్జి సారెడ్డి సోమమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హుజూర్ నగర్ ఎస్సై చలికంటి నరేష్ తెలిపారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాధితుడిపై ఫోక్సో కేసు నమోదు అంశంపై పోలీస్ అధికారులు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రజలకు రక్షణ కల్పిస్తూ నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులే ఇలా సమాజం సిగ్గుపడే పనులు చేయడం ఏంటని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.