31 May, 2026 | 1:35 AM

భారత్‌లో పేలుళ్లకు కుట్ర

31-05-2026 12:46 AM
  1. తొమ్మిది మంది అరెస్ట్
  2. 4 గ్రెనేడ్లు, 25 లైవ్ కాట్రిడ్జ్‌లు, పేలుడు పదార్థాలు స్వాధీనం
  3. ఐఎస్‌ఐ, దావూద్‌తో సంబంధాలు
  4. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కూపీ లాగిన పోలీసులు 

న్యూఢిల్లీ, మే 30: ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన 9మందిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 4 గ్రేనేడ్లు, 25 లైవ్ కాట్రిడ్జ్‌లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీరికి పాక్ ఐఎస్‌ఐ, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుళ్లకు కుట్రపన్నిన వారిలో మున్నా (జింగాడా సలీం), దిలావర్‌ఖాన్, షాజాద్ భట్టి, అమీర్ జాట్ అనే నలుగురు ప్రధాన సూత్రధారులుగా  భావిస్తున్నారు.

షాజాద్ భట్‌తో సంబంధాలున్నాయన్న అనుమానంతో పూణెకు చెందిన ఒక షార్ప్ షూటర్‌ను, సాహిబ్‌గంజ్‌లో మరొకరిని అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఛతర్‌పూర్ వైపు వెళుతున్న మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరు, పంజాబ్‌కు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. వీరు ఢిల్లీలోని భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడానికి ప్రణాళిక రచించినట్లు గుర్తించారు. వీరి విచారణలో ఛోటారాజన్‌పై దాడి చేసిన మున్నా జింగాడాను గుర్తించారు.

మున్నా (నేపాలీ) అలియాస్ జింగాడా సలీం అనే పేరుతో 2005లోనే పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడి నుంచి భారత్‌లో పేలుళ్లకు కుట్రలు పన్నుతున్నాడు. ఉగ్రవాద నియామకాలు, దాడుల ఆదేశాలు, ఆయుధాలు, డబ్బుల పంపిణీ వంటివి చూస్తుంటాడు. ఇతనికి పాక్ ఐఎస్‌ఐ, అండర్‌వరల్డ్‌తో దగ్గరి సంబంధాలున్నాయి. మున్నానే పాక్ నుంచి గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలు పంపినట్లు స్పెషల్ సెల్ పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మున్నా కరాచీలో తలదాచుకున్నాడు.

ఈ మాడ్యుల్‌కు ఐఎస్‌ఐ శిక్షణ ఇచ్చిందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. పలు భవనాలు, భద్రతా సిబ్బంది, మతపరమైన ఆలయాలు, రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేసేందుకు వీరు కుట్రలు పన్నారు. దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూపీ లాగారు. వీరికి స్థానిక హ్యాండ్లర్లు సహకరించినట్లు గుర్తించారు. వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.