2 September, 2026 | 7:19 PM

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది

02-09-2026 | 06:36pm

ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం 

బాన్సువాడ, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌(Bajireddy Goverdhan) ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) పిలుపు మేరకు బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోనీ అంబేద్కర్ చౌరస్తా(Ambedkar Square) వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని అన్నారు. రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. వృద్ధులకు పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress government) మోసం చేసిందని బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆరోపించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. హామీల అమలులో ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, భవిష్యత్‌లో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మోరిల్ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుబేర్,అంజిరెడ్డి, నార్ల రత్నకుమార్, సర్పంచ్ ధర్మ తేజ, మోచి గణేష్, బాడీ శ్రీనివాస్ అక్బర్ ఖలీల్ ఫిరోజ్ సాయి శివ రమేష్ యాదవ్ సద్దాం వైయస్ దాస్ నందు హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు