తల్లాడలో కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన
420 హామీలకు ప్రతీకగా 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో ర్యాలీ
సత్తుపల్లి తల్లాడ. సెప్టెంబర్ 2.( విజయ క్రాంతి): తల్లాడ. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య(Sandra Venkata Veeraiah) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం తల్లాడలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
నారాయణపురం నుంచి తల్లాడ రింగ్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలకు ప్రతీకగా 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య(Sandra Venkata Veeraiah) మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని ప్రజలకు మాట ఇచ్చిందని, కానీ 1000 రోజులు పూర్తయినా ఆ హామీల్లో అనేకం అమలుకు నోచుకోలేదని అన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, ఉద్యోగులకు పీఆర్సీ విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో రైతులు, ఉద్యోగులు, మహిళలు, దివ్యాంగులు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలలో తులం బంగారం హామీ ఏమైందని సండ్ర ప్రశ్నించారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
రైతులు యూరియా(Uread) కోసం రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ రంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచామని, రైతుల సమస్యలను పరిష్కరించడంలో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందని పేర్కొన్నారు.
సాగునీటి విషయంలోనూ తల్లాడ ప్రాంత రైతుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని సండ్ర ఆరోపించారు. కల్లూరు, వేంసూరు ప్రాంతాలకు నీరు వస్తున్నప్పుడు తల్లాడకు ఎందుకు సాగునీరు అందడం లేదని ప్రశ్నించారు. తల్లాడ ప్రాంత రైతులకు వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
రైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని సండ్ర వెంకట వీరయ్య హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. హామీల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్() ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తుందని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






