2 March, 2026 | 1:57 AM

జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కాంగ్రెస్ : హరీశ్‌రావు

02-03-2026 12:00 AM

అక్రిడిటేషన్ కార్డులపై చిన్నచూపు

జర్నలిస్టుల సంక్షేమ నిధి 16 కోట్లు విడుదల చేయాలి

సిద్దిపేట, మార్చి 1 (విజయక్రాంతి): ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమించే జర్నలిస్టుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో ’కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్-5’ను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మైదానంలో బ్యాట్ పట్టి కాసేపు సందడి చేసిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.

కేసీఆర్ హయాంలో జర్నలిస్టుల కోసం ఇళ్ల స్థలాలు ఇచ్చి, సంక్షేమ నిధికి కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టులకు ఒక్క కొత్త అక్రిడిటేషన్ కార్డు కూడా ఇవ్వకపోగా, ఉన్నవాటిని తొలగించే ప్రయత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఉద్యోగులతో పాటు జర్నలిస్టులను హెల్త్ స్కీమ్లో భాగస్వామ్యం చేయకపోవడం ప్రభుత్వ చిన్నచూపుకు నిదర్శనమని, గతంలో కేటాయించిన 16 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి యూట్యూబ్ జర్నలిస్టుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన హరీష్ రావు, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల సమస్యలపై బీఆర్‌ఎస్ పక్షాన గట్టిగా పోరాడుతామని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు నిర్వహించిన క్రికెట్ పోటీలలో గెలుపొందిన జర్నలిస్టు క్రికెట్ జట్టుకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.