05-02-2026 12:29:08 AM
సిరిసిల్ల, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సిరిసిల్లలో నిర్వ హించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో బండి సంజయ్ మాట్లాడారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవంటూ శాసనసభ స్పీకర్ తీర్పు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. “స్పీకర్ సార్.. మీరు నిజాయితీపరులు, మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది’ అన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీభవన్‌లోనే సంసారం చేస్తున్నా రని ఎద్దేవా చేశారు. కళ్ల ముందే ఇవన్నీ కన్పిస్తున్నా పార్టీ మారినట్లు ఆధారాల్లేవని కేసు కొట్టివేయడం దారుణమని విమర్శించారు. ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిపై మచ్చ పడి చరిత్ర హీనులు కావొద్దని కోరారు. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకున్న వారిని నిలదీయాలన్నా రు.
‘మాకు భయపడి కేసీఆర్ కొడుకు సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు 10 వేలు ఇస్తున్నడట. ఆ డబ్బులు మనవే తీసుకోండి. ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు వేసి బీజేపీకి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని అప్పగించాలి’ అని కోరారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సిరిసిల్లలో ఒక్కటంటే అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదన్నారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించడంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, రాష్ట్రఅధికార ప్రతినిధి జె సం గప్ప, నేతలు, అభ్యర్థులు పాల్గొన్నారు.