శ్రీ చక్రేశ్వర శివాలయంలో లడ్డు, పులిహోర విక్రయాల లీజు వేలంపాట నిర్వహణ
బోధన్,జూలై15(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో లడ్డు, పులిహోర తదితర ప్రసాదాల విక్రయానికి సంబంధించిన బహిరంగ లీజు లైసెన్స్ వేలంపాటను నేడు నిర్వహించారు. ఈ వేలంపాటలో మొత్తం 11 మంది సభ్యులు హాజరుకాగా, వారిలో నలుగురు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొన్నారు. సంవత్సరానికి రూ.1,54,800 చొప్పున, రెండేళ్ల కాలానికి మొత్తం రూ.3,09,600కు నిజామాబాద్ జిల్లాకు చెందిన జి. రమేష్ (తండ్రి: లింగోజి) అత్యధిక బిడ్ దాఖలు చేసి లీజును దక్కించుకున్నారు.
ఈ లీజు లైసెన్స్ వేలంపాటను నిజామాబాద్ జిల్లా ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సుజాత రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు లక్ష్మణరావు, పటేల్ ఆరుగొండ శంకర్, జక్కం వీరప్ప, ఆలయ కార్యనిర్వహణ అధికారి రాములు, ఆలయ అర్చకులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.






