10 July, 2026 | 3:30 PM

రెంజల్ మండల కేంద్రంలో ఘనంగా గంగాలీల ఉత్సవాల ముగింపు.

10-07-2026 02:22 PM

- గంగా నీళ్లతో గ్రామదేవతలకు జలాభిషేకం

బోధన్,(విజయక్రాంతి): రెంజల్ మండల కేంద్రంలో శుక్రవారం గంగాలీల ఉత్సవాల్లో భాగంగా ఐదో వారం ముగింపు ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని రెంజల్ గ్రామ సర్పంచ్ తిరుపతి లలిత బుజ్జి ఆధ్వర్యంలో గత నాలుగు వారాలుగా గంగానీళ్లతో గ్రామదేవతలకు అభిషేకం నిర్వహించారు. ఇదే తరహాలో శుక్రవారం కందకుర్తి నుండి గంగాజలాలను తీసుకువచ్చి గ్రామదేవతలకు అభిషేకం నిర్వహించామని సర్పంచ్  వెల్లడించారు.

శుక్రవారం తెల్లవారుజామున దాదాపు 500 మందితో కాలినడకన కందకుర్తికి బయలుదేరి గంగా జలాలను తీసుకువచ్చి పండగ వాతావరణం లో గ్రామదేవతలను పూజించామని గ్రామస్తులు వెల్లడించారు. వర్షాలు కురవాలని, సకాలంలో వానలు పడాలని కోరుతూ గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా గంగానీళ్ల కార్యక్రమాన్ని గత నాలుగు వారాలుగా నిర్వహిస్తున్నామన్నారు. 

మహిళలు బోనాలు, గంగానీళ్లు తీసుకుని ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం బోయి సంఘం సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెంజల్ గ్రామ సర్పంచ్ తిరుపతి లలిత బుజ్జి, ఉపసర్పంచ్ మానస రాకేష్,బోయి సంఘం అధ్యక్షులు పాముల శంకర్, పిల్లిరాజన్న, తగిలపల్లి పండరి, అంజన్న,మాజీ ఎంపిటిసి రవి, ఇర్ల రాజు పాల్గొన్నారు.