స్పెషలాఫీసర్లు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలి
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, మే 18 (విజయక్రాంతి) : జిల్లాలోని మండలాలకు ప్రత్యేక అధికారులుగా నియమించబడ్డ జిల్లా అధికారులు తమ మండలాల పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
సోమ వారం జిల్లా అధికారులతో మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులు, గోదాములకు తరలించేలా పర్యవేక్షించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దిగుమతి, హమాలీల సంఖ్య పెంపుదల అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
అనంతరం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు పర్యాటక రంగం ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాల సంబంధిత కరపత్రాలు, గిరిజనుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన జన జాతీయ గరిమ ఉత్సవ్ 2026 గోడ ప్రతులను అధికారులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు.
యువ టూరిజం క్లబ్, అవగాహన కార్యక్రమాలు, హెరిటేజ్ వాక్, స్థానిక ఇన్ ప్లూయెన్సర్, యూ ట్యూబర్స్ తో సమావేశం, స్వచ్ఛత, టూరిజం బ్రాండ్ విడుదల, పారిశుధ్యం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ లో భాగంగా గిరిజన గ్రామాలలో రహదారులు, త్రాగునీరు, ఆరోగ్యం, విద్యుత్, ఇండ్ల నిర్మాణం వంటి కనీస సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
హమాలీల సంఖ్య పెంచుకోవాలి
మంచిర్యాల, మే 18 (విజయక్రాంతి) : జిల్లాలోని గోదాములలో, మిల్లుల్లో ధాన్యం దిగుమతి వేగం పెంచేందుకు అవసరమైన హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమ వారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ లోని గోదాములను, భీమారం మండలం అంకుశపూర్ లోని రైస్ మిల్లులను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళలతో కలిసి సందర్శించి ధాన్యం దిగుమతి ప్రక్రియను పరిశీలించారు.
గోదాముల్లో, రైస్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవాలని సూచించారు. రోజులో కనీసం 10 నుంచి 15 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని, అవసరం మేరకు హమాలీల సంఖ్య పెంపొందించుకోవాలన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ధాన్యం తరలింపునకు అవసరమైన లారీలను సమకూర్చడం జరుగుతుందని, రైస్ మిల్లుల యజమానులు ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలన్నారు.
నిబంధనల మేరకు కొనుగోళ్లు జరపాలి
చెన్నూర్, మే 18 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. సోమవారం చెన్నూర్ నియోజక వర్గంలోని భీమారం మండలం పోలంపల్లి, భీమారంలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు.






