7 March, 2026 | 11:06 AM

అంబర్‌పేటలో సర్వీస్ రోడ్డును పూర్తిచేయండి

07-03-2026 01:55 AM
  1. భూసేకరణ సమస్యతో ఫ్లు ఓవర్ కింద పూర్తికాని సర్వీస్ రోడ్డు
  2. ప్రత్యేక చొరవ చూపించి సమస్యను పరిష్కరించాలి
  3. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): అంబర్‌పేట ఫ్లై ఓవర్ కింద ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమైన జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పట్ల ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉన్నారని,

రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న రూ.1.85 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టుల కేటాయింపులు కేంద్ర ప్రభుత్వానికి తెలం గాణ అభివృద్ధిపై ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమని తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 2,800 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, మరో 2,500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం వివిధ దశల్లో ఉందని గుర్తుచేశారు. తద్వారా రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలకు తక్కువ సమయంలోనే జాతీయ రహదారులతో అనుసంధానించడం చాలా గొప్ప విషయమని పేర్కొ న్నారు.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని, ప్రయాణ సమయాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదా రుల మంత్రిత్వ శాఖ రూ.265 కోట్లతో ఎన్‌హెచ్ 163పై నగరంలోని అంబర్‌పేట క్రాస్ రోడ్డు వద్ద 1.5 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల ఫ్లై ఓవర్‌ను నిర్మించిందని, గత ఏడాది మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లై ఓవర్‌ను ప్రా రంభించారని గుర్తుచేశారు. ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తు, ప్రారంభోత్సవం కూడా పూర్తి చేసుకున్నప్పటికీ అవసరమైన భూసేకరణ పూర్తి కానందున దాని కింద ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదని వివరించారు.

భూసేకరణ విషయంలో కొన్ని శక్తులు అడ్డుతగులుతుండటంతో అనవసరంగా తీవ్ర జాప్యం జరుగుతు న్నదని, దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఇదే విషయాన్ని గత సీఎం కేసీఆర్‌కు, మీకు అనేకసార్లు తెలియజేశామని, మంత్రులకు స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా అనేకసార్లు తెలియజేశారని వివరించారు.

తాను కూడా జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఇతర సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి అనేకసార్లు మాట్లాడినా సమస్య ఒక కొలిక్కి రాలేదని తెలిపారు. భూసేకరణకు రూ.2.54 కోట్ల పరిహారం లబ్ధిదారునికి ప్రభుత్వం చెల్లించినప్పటికీ మధ్య దళారులు అడ్డుకుంటున్నారని స్పష్టంచేశారు. అందుకే ఈ విషయంలో వ్యక్తిగతంగా చొరవ చూపించి, సర్వీ సు రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకొని పూర్తిస్థాయిలో నిర్మించడానికి సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.