1 August, 2026 | 3:59 AM

నేరాల నియంత్రణకు ‘కమ్యూనిటీ కాంటాక్ట్’ కీలకం

01-08-2026 12:00 AM

డీఎస్పీ మొగిలయ్య

అలంపూర్, జూలై 31: నేరాల నిర్మూలనతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం అలంపూర్ పట్టణంలో ప్రత్యేక కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాలుగు బృందాలుగా విభజించి పట్టణంలో సుమారు 150 ఇళ్లలో తనిఖీలు నిర్వహించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వ్యక్తుల వివరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు జరిగినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రదీప్, ఎస్‌ఐ రామకృష్ణ, సురేష్,రవి,తరుణ్  పాల్గొన్నారు