బాధితుల వద్దకే కలెక్టర్..!
జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ జూలై 6 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు చేయడానికి వచ్చి నడవలేని స్థితిలో ఉన్న పలువురు బాధితుల వద్దకు స్వయంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చేరుకొని వారి ఫిర్యాదులను స్వీకరించి, సావధానంగా వారు చెప్పిన విషయాలను విని సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి ఆదేశాలు దారి చేశారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజల నుండి 112 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పలువురు దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్న కొందరు విజ్ఞాపన పత్రాలను అందించడానికి వచ్చారు. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్ స్వయంగా వారి వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని వారిచ్చిన విజ్ఞాపన పత్రాలను తీసుకొని అన్ని విధాలుగా ప్రభుత్వం నుండి సహాయం అందిలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహించకుండా నిబంధనల ప్రకారం పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన దరఖాస్తులపై త్వరితగతిన నివేదికలు రూపొందించి సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డిఆర్వో వసంత కుమారి, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






