21 April, 2026 | 6:43 PM

విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

21-04-2026 05:22 PM

హనుమకొండ,(విజయక్రాంతి): విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ తమ లక్ష్యాలను సాధించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల వారోత్సవాల సందర్భంగా మంగళవారం శాయంపేట మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించి, అక్కడి విద్యా వాతావరణం, సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని స్టోర్ రూమ్, నిత్యావసర వస్తువుల నిల్వలను పరిశీలించారు.

వంటగదిని తనిఖీ చేసి, వంట పదార్థాల నాణ్యతను,  పరిసరాల, బాత్ రూమ్ ల పరిశుభ్రత పరిశీలించారు. పలు తరగతి గదులను సందర్శించి, విద్యార్థులతో, ఉపాధ్యాయులతో మాట్లాడి బోధన విధానంపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల చేత పాఠ్యాంశాన్ని చదివించి వారి అభ్యాసస్థాయిని అంచనా వేశారు. పరీక్షలు జరుగుతున్న తరగతులను కూడా పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, ఏకాగ్రతతో పరీక్షలను ఎదుర్కొని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.

క్రమబద్ధమైన అధ్యయనం, సమయపాలనతో పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబర్చాలని ప్రోత్సహించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని పునశ్చరణ కు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సెలవుల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి, ఆటలు, సృజనాత్మక కార్యక్రమాలకు సమయం కేటాయించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ను కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీవో డాక్టర్ కన్నం నారాయణ, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో ఫణి చంద్ర, ఎంఈఓ భిక్షపతి, పాఠశాల ప్రిన్సిపల్ రేవతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.