calender_icon.png 6 February, 2026 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు

06-02-2026 01:58:39 AM

అధికారులకు కలెక్టర్ రాజార్షిషా ఆదేశం

ఆదిలాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల విధుల్లో అధికారులు  ఏమాత్రం అలసత్వం వహించినా సహించబోమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజార్షి షా హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదిలాబాద్ మున్సిపాలిటీకి జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో గురువారం జడ్పీ కాన్ఫరెన్స్ హాల్లో మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ ఎన్నికల నియమావళి, ఈవీఎంల నిర్వహణ, పోలింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధి కారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రతి అధికారి ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించేలా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అంతకుముందు ఎన్నికల పరిశీలకులు హనుమంతు నాయక్ మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ నివేదికలు అందజేయా లని సూచించారు. ఎన్నికల నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జి. రాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.