ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
సుల్తానాబాద్,(విజయక్రాంతి): రైతులు విక్రయిస్తున్న ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే అన్‌లోడింగ్ చేసి నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రైస్ మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాలలోని మహేష్ రైస్ మిల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా అన్‌లోడింగ్ చేసి నిల్వ చేయాలని సూచించారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం దిగుమతులను వేగవంతంగా నిర్వహించాలని తెలిపారు. ధాన్యం రవాణా, అన్‌లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమన్నారు. ఈ సందర్భంగా రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు, అన్‌లోడింగ్ పరిస్థితులు, వాహనాల నిర్వహణ తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించి సంబంధిత నిర్వాహకులకు అవసరమైన సూచనలు చేశారు.ఈ పర్యటనలో పౌర సరఫరా సిబ్బంది మహేష్ , రవీందర్,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు .






