రైతులకు ఇబ్బందులు రానివ్వకండి
అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాల్సిందే
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయి
జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
అడ్డాకుల : రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. మండలంలో మిల్లులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ డి జానకితో కలిసి పరిశీంచారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్.పి డి. జానకి సోమవారం అడ్డాకల్ మండలంలోని రైస్‌మిల్లు, పోలీస్ చెక్‌పోస్ట్ ను సంయుక్తంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్.పి జానకి తో తో కలిసి అడ్డకల్ మండల గుడిబండ గ్రామంలోని రామాంజనేయ ప్యాడీ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లును సందర్శించి, లారీల నుంచి ధాన్యం బస్తాల అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు.
మిల్లు మొత్తం కొనుగోలు సామర్థ్యంపై ఆరా తీయగా, 1.75 లక్షల బస్తాల సామర్థ్యం ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 35 వేల బస్తాల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కేటాయించిన సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యం ఎత్తిపోతలు చేపట్టకపోవడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే మరిన్ని హమాలీలను నియమించుకోవాలని, అదనపు రవాణా వాహనాలను ఏర్పాటు చేయాలని, మిల్లులో ధాన్యం అన్‌లోడింగ్‌కు తగిన స్థలాన్ని సిద్ధం చేయాలని మిల్లర్‌కు ఆదేశించారు. అవసరమైతే ప్రభుత్వం గోదాం సౌకర్యాలు కల్పించేందుకు సహకరిస్తుందని, అయితే సమీప పి .పి.సి కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంటనే తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఒక డీటీఏ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. మరో రెండు రోజుల్లో రైతుల వద్ద ఉన్న మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే సంబంధిత మిల్లును బ్లాక్‌లిస్ట్ చేసి, వచ్చే సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వబోమని కలెక్టర్ హెచ్చరించారు. పి .పి.సి కేంద్రాలు, మిల్లర్ల మధ్య సమన్వయం పెంచి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా పౌర సరఫరాల మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు. తదుపరి కలెక్టర్ అదే మండలం లోని లక్ష్మీనరసింహ అగ్రోటెక్ రైస్ మిల్లును సందర్శించారు.
అక్కడ నాలుగు ట్రాక్టర్ల ధాన్యం అన్‌లోడింగ్ కోసం పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఈ మిల్లు కూడా లక్ష బస్తాల సామర్థ్యం ఉండగా ఇప్పటివరకు కేవలం 60 వేల బస్తాల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, సమీప పీపీసీ కేంద్రాల నుంచి మిగిలిన 40 వేల బస్తాల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మిల్లర్‌ను ఆదేశించారు. “తాలు, తరుగు” పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సంబంధిత మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఖుష్బూ గుప్తా హెచ్చరించారు.
అటునుంచి మిల్లులో జరుగుతున్న ధాన్యం బస్తాల అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. లారీల నుంచి ధాన్యం బస్తాలను వేగంగా దింపేలా చర్యలు తీసుకోవాలని, తగినంత మంది హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే అదనపు రవాణా వాహనాలను సమకూర్చుకొని కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన తరలించేలా చూడాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. అనంతరం మార్గ మధ్యలో ఉన్న ఒక పోలీస్ చెక్‌పోస్ట్‌ను సందర్శించిన కలెక్టర్, ఎస్.పి అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి చెక్‌పోస్ట్ వద్ద ఎన్ని శాఖల అధికారులు విధుల్లో ఉన్నారు,
షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వహిస్తున్నారా, రాత్రి సమయంలో అక్కడే బస చేస్తున్నారా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారు, అనుమానాస్పద రవాణా కార్యకలాపాలు ఏవైనా గుర్తిస్తున్నారా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా పోలీసు, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖలకు చెందిన సిబ్బంది చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తూ అనుమానాస్పద రవాణాపై నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల సంస్థ డి.ఎం. రవి నాయక్, డి.పి.ఎం లక్ష్మయ్య, అడ్డకల్ మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






