వరి ధాన్యం నిల్వ ప్రక్రియ సక్రమంగా చేపట్టాలి
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
తూప్రాన్,(విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు, గోదాములకు త్వరితగతిన తరలించాలని, ధాన్యం దెబ్బతినకుండా నిల్వ ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అల్లాపూర్ గ్రామంలోని నవదుర్గా రైస్ మిల్లు అన్లోడింగ్ ను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని, కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు, గోదాములకు తరలించాలని సంబంధిత రైస్ మిల్లర్లు, అధికారులు తరలించిన ధాన్యాన్ని త్వరగా దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఒకరోజులో కనీసం 10 నుంచి 15 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని, అవసరం మేరకు హమాలీల సంఖ్య పెంపొందించుకోవాలని సూచించారు. ధాన్యం తరలింపుకు అవసరమైన లారీలను సమకూర్చడం జరుగుతుందని, రైస్ మిల్లుల యజమానులు ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని తెలిపారు. తూప్రాన్ ఆర్డీవో జై చంద్ర రెడ్డి, ప్రత్యేక అధికారి జడ్పీ సీఈఓ ఎల్లయ్య, తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి డిప్యూటీ తాసిల్దార్ శ్రీకాంత్ కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, మిల్లర్స్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.






