15 May, 2026 | 9:28 PM

Breaking News

గోదావరిఖనిలో స్నిఫర్ డాగ్‌తో పోలీసుల మెరుపు తనిఖీలు

15-05-2026 08:48 PM

సీఐ ఇంద్రసేనారెడ్డి అధ్వర్యంలో బస్టాండ్ లో విసృతంగా తనిఖీలు

గోదావరిఖని,(విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల కట్టడికి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం పెద్దపల్లి జోన్ గోదావరిఖని వన్‌టౌన్ పరిధిలోని బస్టాండ్, కార్గో పార్సిల్ కేంద్రాలు, దుకాణాల్లో వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి నార్కోటిక్ వింగ్ ఇన్‌స్పెక్టర్ ఎం. రాజ్‌కుమార్ సమన్వయంతో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ సహాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

 తంబాకు తనిఖీల సమయంలో బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి బ్యాగ్‌ను స్నిఫర్ డాగ్ గుర్తించగా, పోలీసులు తనిఖీ చేసి నిషేధిత పొగాకు (తంబాకు) ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి లేదా మత్తు పదార్థాలు ఎక్కడ దాచినా, ప్రత్యేక శిక్షణ పొందిన ఈ డాగ్ క్షణాల్లో పసిగడుతుందని పోలీసులు తెలిపారు. చిన్నపిల్లలకు మత్తు కలిపిన చాక్లెట్లు, గుట్కా, సిగరెట్లు వంటి నిషేధిత వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

 బస్సులు, రైళ్లలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డైల్ 100 లేదా నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని,  చట్టవ్యతిరేక పనులకు పాల్పడే వారిపై రాజీలేని చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్ టీమ్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, 1-టౌన్ ఎస్‌ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.