15 May, 2026 | 9:28 PM

Breaking News

జాతీయ ఈ-గవర్నెన్స్‌కు యాదగిరిగుట్ట ఎంపిక

15-05-2026 08:46 PM

యాదగిరిగుట్ట దేవస్థానంకు అరుదైన గౌరవం: ఈవో భవాని శంకర్

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన  యాదగిరిగుట్ట దేవస్థానం మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 29వ జాతీయ ఈ-గవర్నెన్స్ ఎంపిక ప్రక్రియలో దేవస్థానం తుది దశకు చేరుకుంది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సదస్సులో దేవస్థానం ఈ ఓ జె.భవానీ శంకర్ పాల్గొని, ఆలయ డిజిటల్ సేవలపై సమగ్రమైన ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థలు చేపట్టిన డిజిటల్ సేవల పరివర్తన కార్యక్రమాలు ప్రదర్శించబడ్డాయన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 802 అప్లికేషన్లు అందగా, వాటిలో కేవలం 32 ప్రాజెక్టులు మాత్రమే షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. ఈనెల 14న దేవస్థానం బృందం ఢిల్లీకి వెళ్లి జ్యూరీ సమక్షంలో ఫైనల్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.  జ్యూరీ సభ్యుల నుండి సానుకూల స్పందన లభించింది.

 యాదగిరిగుట్ట దేవస్థానం చేపట్టిన డిజిటల్ ప్రజెంటేషన్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషమైన విషయం. భక్తులకు పారదర్శకత, సౌలభ్యం మరియు సమర్థతను అందించడంలో ఈ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవలి కాలంలో యాదగిరిగుట్ట దేవస్థానం ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతూ“తెలంగాణ తిరుపతి”గా ఖ్యాతి గడిస్తున్న నేపథ్యంలో, ఈ జాతీయ స్థాయి గుర్తింపు దేవస్థానానికి మరింత గౌరవాన్ని తీసుకువచ్చింది.