11 March, 2026 | 12:06 PM

పనితీరు మార్చుకోకపోతే కఠన చర్యలు

11-03-2026 01:20 AM

పీహెచ్‌సీ సిబ్బందిపై కలెక్టర్ హరిత ఆగ్రహం

కౌటాల మండల కేంద్రంలో పలు కార్యాలయాలు తనిఖీ 

కుమ్రంభీం అసిఫాబాద్, మార్చి 10(విజయక్రాంతి): పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ కె. హరిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం కౌటాల మండల కేంద్రంలో ఆకస్మి కంగా పలు కార్యాలయాలను తనిఖీ చేసిన సందర్భంగా పీహెచ్సీలో డాక్టర్ లేకపోవడం, సిబ్బంది హాజరు పట్టికలో ఖాళీలు ఉండటంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌటాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌కు అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో పాటు కేవలం సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నట్లు తెలిసింది. డాక్టర్ పవన్‌కళ్యాణ్ రాజీనామా చేసిన తర్వాత ఆసుపత్రిలో వైద్యుడు లేనట్లు అధికారులు తెలిపారు.

హాస్పిటల్ రిజిస్టర్లు పరిశీలించిన కలెక్టర్ పలువురు సిబ్బంది విధులకు హాజరుకాకపోవడం, హాజరు పట్టికలో ఖాళీలు ఉండడాన్ని గమనించి ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నించారు. డాక్టర్ లేకపోవడంతో వారంలో మూడు రోజులు ఆయుష్ డాక్టర్ వస్తున్నట్లు సిబ్బంది చెప్పగా, ఆయుష్ అటెండర్ విధులకు హాజరు కాకపోవడంతో వెంటనే గైర్హాజరు నమోదు చేయాలని ఆదేశించారు. డేటా ఎంట్రీ గది మూసి ఉండటాన్ని గమనిం చి తెరవాలని చెప్పగా, అందులో ఉన్న కంప్యూటర్, ప్రింటర్‌పై దుమ్ము పేరుకుపోయి ఉండ టాన్ని చూసి అధికారుల పనితీరుపై కలెక్టర్ ఘాటుగా మందలించారు.

అనంతరం జిల్లా పరిషత్ సెకండరీ హాస్టల్ ను తనిఖీ చేసి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. గైర్హాజరు అయిన విద్యార్థుల గురించి ఆరా తీశారు. వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ముందుకు సాగాలని విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచించారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో భయపడకుండా ప్రశాంతంగా చదువులపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. మధ్యాహ్న భోజ నం, ప్రహరీ గోడ నిర్మాణం గురించి కూడా వివరాలు తెలుసుకున్నారు. తర్వాత పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని పరిశీలించారు. అలాగే బీసీ బాలుర హాస్టల్ను తనిఖీ చేసి స్టోర్ రూమ్, వంటగది, విద్యార్థుల గదులను పరిశీలించారు. విద్యార్థులకు పరిశుభ్ర మైన, హైజీనిక్ ఆహారం అందించాలని వార్డెన్‌ను ఆదేశించారు.

మండల కేంద్రంలో జరుగుతున్న ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ పరీక్షల నిర్వహణపై అడిగి తెలుసుకు న్నారు. కౌటాల మండల పర్యటనలో భాగం గా తుమిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిని కలెక్టర్ హరిత పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని సందర్శించి నీటి లభ్యత, వర్షాకాలంలో వరద పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ నదుల కలయికతో ప్రాణహిత నది ఏర్పడుతున్న విషయాన్ని ఎంపీడీవో ప్రసాద్ కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో మండలాభివృద్ధి అధికారి ప్రసాద్, తహసీల్దార్ ప్రమోద్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.