పిల్లలు లేని వారికి దత్తత ఒక వరం
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల,(విజయక్రాంతి): పిల్లలు లేని వారికి దత్తత ఒక వరం లాంటిదని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం ఇద్దరు చిన్నారులను దత్తతకు అందించారు, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. పిల్లలను చక్కగా చూసుకోవాలని చెప్పారు. ఎవరైనా చట్టబద్ధంగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ద్వారా మాత్రమే ఆన్లైన్ ద్వారా పిల్లలను దత్తతకు ఎంపిక చేసుకోవాలని సూచించారు.
అలాకాకుండా ఇతర అక్రమ మార్గాలలో చేసుకున్నట్లయితే ఐదు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా ఉంటుందని హెచ్చరించారు. పిల్లలను పెంచే స్థోమత లేనటువంటి తల్లితండ్రులు తమ పిల్లల్ని దత్తత కోసం అప్పగించవచ్చని కలెక్టర్ అన్నారు. పిల్లలను రోడ్డు మీద వదిలి వేస్తున్న వారి తల్లిదండ్రులపైన జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారము చర్య తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రస్తుతం దత్తత కోసం చాలామంది ఎదురుచూస్తున్నారని, ఎవరికైనా పిల్లలు పెంచే శక్తి లేనట్లయితే, అవాంచిత గర్భం అయినప్పుడు, వద్దు అనుకున్నట్లయితే పిల్లలని ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రాలకు అప్పగించాలని, వారిని చట్ట ప్రకారం దత్తతకు పంపిస్తామని స్పష్టం చేశారు.దీంతో ఆ పిల్లలకు మంచి జీవితాన్ని, వెలుగులు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా బాలల ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎన్ఐసీ ఎం గగన్ కుమార్ పాల్గొన్నారు.






