17 June, 2026 | 1:24 AM

మారుమూల గిరిజన మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన

17-06-2026 12:07 AM

ఆళ్లపల్లి, జూన్ 16, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల గిరిజన ప్రాంతమైన ఆళ్లపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృత పర్యటన నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు విద్యా ప్రమాణాల మెరుగుదలకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

మండలంలో పర్యటించిన ఆయన ఆళ్ళపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం వివరాలను ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ప్రీ-ప్రైమరీ విభాగం, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి, చిన్నారులకు అందిస్తున్న బోధన విధానం, విద్యా కార్యకలాపాలపై వివరాలు తెలుసుకున్నారు.

అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించేందుకు సిద్ధంగా ఉంచిన భోజనం, పాలు, బాలామృతం తదితర పోషకాహార పదార్థాలను పరిశీలించారు. కేంద్రంలో కేవలం ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండటాన్ని గమనించిన కలెక్టర్, హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పెద్ద వెంకటాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు.

గొత్తికోయలు నివసించే ఈ మారుమూల గిరిజన ప్రాంతంలో బడిఈడు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.   ఆళ్ళపల్లి నుండి పెద్ద వెంకటాపురం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు కుంగిపోయి ఉండటాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ గమనించారు. 

వర్షాకాలంలో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసరంగా మరమ్మత్తు చేపట్టాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులను ఆదేశించారు.  కలెక్టర్ వెంట కొత్తగూడెం ఆర్డీవో మధు,  ఆళ్లపల్లి తాసిల్దారు ఉషారాణి, ఎంఈఓ శాంతారావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.