హుస్నాబాద్ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
వైద్యులు, సిబ్బందిని కేటాయించాలని డీఎంఅండ్‌హెచ్ ఓకు ఆదేశాలు
హుస్నాబాద్, జూలై 23: హుస్నాబాద్ మాతా - శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి గురువారం ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవల తీరును పరిశీలించారు. డాక్టర్లు, నర్సులు, సిబ్బంది హాజరు, ఓపీ రిజిస్టర్ను తనిఖీ చేసిన ఆమె, ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మందులు, వైద్య పరికరాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
వైద్యులు, సిబ్బంది కొరతపై అధికారులు దృష్టికి తీసుకురాగా, సమీప ఆసుపత్రుల నుంచి అవసరమైన సిబ్బందిని హుస్నాబాద్కు కేటాయించాలని డీఎంఅండ్హెచ్‌ఓకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.అనంతరం రూ.82 కోట్లతో నిర్మిస్తున్న 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్కు సూచించారు. నిర్మాణ కార్మికుల పిల్లలను సమీప అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.






