13 March, 2026 | 7:18 PM

ప్రజా ప్రతినిధులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

13-03-2026 06:04 PM

కలెక్టర్ చంద్రశేఖర్

మిర్యాలగూడ,(విజయక్రాంతి): నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ నియోజకవర్గంలోని నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక సన్నాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజులపాటు నిర్వహించవలసిన కార్యక్రమాలను షెడ్యూలు ప్రకారం రూపొందించి 10 ప్రధాన అంశాలను తీసుకొని వాటిపై అవగాహనతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా ఇప్పటివరకు ప్రభుత్వం సాధించిన అభివృద్ధిపై ప్రజలకు తెలియజేసేందుకు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. ఇందులో భాగంగా మార్చి 6 నుండి 15 వరకు అన్ని గ్రామాలు పట్టణాలు కార్యాలయాలు పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టేందుకు దిశ నిర్దేశించడం జరిగిందని అంతేకాక అన్ని ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలలో ఫైల్లో పరిష్కారం చేపట్టినట్లు తెలిపారు.

ప్రజా ప్రతినిధులు గ్రామాలలో పర్యటించి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎంపీడీవోలు గ్రామ వారీగా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాబితా రూపొందించి ఏప్రిల్ 2వ తారీఖున నిర్వహించనున్న గ్రామసభలలో వాటిని చదివి వినిపించాలని అదేవిధంగా ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గ్రామ సభలో మున్సిపల్ పట్టణాలలో చర్చించాలని అన్నారు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని ఎల్3 నుండి l వరకు వచ్చిన కొన్ని ఇండ్ల సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నామని ఉగాది నాటికి సామూహిక ఇందిరమ్మ గృహప్రవేశాలను చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈనెల 14వ తారీకు నుండి జరిగే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరూ పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో నూటికి నూరు శాతం సాధించాలన్నారు. పశ్చిమ ఆసియా యుద్ధ నేపథ్యంలో ఎల్పిజి గ్యాస్ కొరతపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలలో డొమెస్టిక్ సిలిండర్ లకు ఎలాంటి కొరతలేదని వాణిజ్యపరమైన సిలిండర్లకు మాత్రమే కొరత ఉందని అందువల్ల ప్రజలు అపవాలను నమ్మవద్దని దళారీల మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లను అక్రమంగా కమర్షియల్ కు వాడిన 16 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. అనంతరం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... ప్రజాప్రతినిధులు అధికారులందరూ కలిసికట్టుగా పనిచేసి మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు నిలపాలన్నారు.

మిర్యాలగూడ వాణిజ్యపరంగా ముందున్నప్పటికీ అనేకమంది పేదవారు ఉన్నారని వారికి విద్య వైద్యానికి పూర్తిగా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు యూరియాకు సంబంధించి మండలాల వారీగా కాకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వారిగా తమకు కేటాయించాలని వైటిపిఎస్ కు సంబంధించిన సి ఎస్ ఆర్ నిధులను అభివృద్ధి పనులకు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నూతన ప్రజాప్రతినిధులు గ్రామాలు మండలాల్లో పర్యటించి సమస్యలు గుర్తించి పరిష్కరించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నదని పేదలు అట్టడుగు వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం గతం నుండి ఎన్నో సంస్కరణలు తెచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మున్సిపల్ చైర్మన్ సుధా, మున్సిపల్ కమిషనర్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.