19 August, 2026 | 5:20 PM

భారీ వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌

19-08-2026 04:15 PM

సుమారు 25 వేల టన్నుల ఉత్పత్తికి నష్టం

నీటితో నిలిచిన గనుల పనులు

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి జేవీఆర్‌ ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గనిపై వర్షం ప్రభావం పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో గనుల్లోకి నీరు చేరడం, రహదారులు బురదమయంగా మారడంతో భారీ యంత్రాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాలు మందగించి సుమారు 25 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో వర్షపు నీరు చేరితే బొగ్గు వెలికితీతతో పాటు ఓవర్‌బర్డెన్‌ తొలగింపు పనులపైనా ప్రభావం పడుతుంది. భారీ యంత్రాలు పనిచేయడానికి వీలుగా రహదారులను పునరుద్ధరించడం, గనుల్లో చేరిన నీటిని పంపుల ద్వారా బయటకు తరలించడం వంటి పనులు చేపట్టాల్సి వస్తుంది.

సింగరేణి యాజమాన్యం వర్షాకాలంలో ఉత్పత్తికి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో భారీ సామర్థ్యం కలిగిన పంపులు, మోటార్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ఓపెన్‌కాస్ట్‌ గనులదే ప్రధాన వాటా కావడంతో భారీ వర్షాలు ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. గతంలోనూ భారీ వర్షాల సమయంలో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయిన సందర్భాలు నమోదయ్యాయి. 

వర్షం తగ్గిన వెంటనే గనుల్లో చేరిన నీటిని తొలగించి, రహదారులను అందుబాటులోకి తీసుకువచ్చి ఉత్పత్తిని సాధారణ స్థాయికి తీసుకురావడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. వర్షాల కారణంగా ఏర్పడిన ఉత్పత్తి లోటును తదుపరి రోజుల్లో అధిగమించేలా చర్యలు చేపట్టనున్నట్లు సింగరేణి వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలోనూ వర్షాల కారణంగా ఉత్పత్తి లక్ష్యాలపై ప్రభావం పడటంతో సంస్థ ఉత్పత్తి లక్ష్యాలను పెంచి లోటును భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది.