19 June, 2026 | 6:26 PM

బొగ్గు రవాణా ఏర్పాట్లను పరిశీలించిన కోల్ మూవ్‌మెంట్ అధికారి బి.వెంకన్న

19-06-2026 04:58 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం ఏరియాలోని ఆర్‌సిహెచ్‌పి (ఆర్సిహెచ్పి), రుద్రంపూర్ రైల్వే సైడింగ్‌లను బి.వెంకన్న, ఐఆర్టిఎస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) శుక్రవారం రోజున సందర్శించారు. అందులోభాగంగా  ఆర్‌సిహెచ్‌పి, రుద్రంపూర్ రైల్వే సైడింగ్‌లలోని బొగ్గు లోడింగ్, రవాణా సదుపాయాలు, మౌలిక వసతులు, నిర్వహణ విధానాలను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. బొగ్గు రవాణా ప్రక్రియ మరింత సమర్థవంతంగా జరిగేలా అవసరమైన సూచనలు చేశారు.

 అనంతరం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్మించనున్న ఆలయానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి. వెంకన్న మాట్లాడుతూ, కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయ ప్రాంగణంలో ఆలయ నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉద్యోగుల్లో సానుకూల ఆలోచనలను పెంపొందించడంతో పాటు ప్రశాంతమైన కార్యాలయ వాతావరణం ఏర్పడేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.  ఉద్యోగులు, కార్మికులకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించి, మనోధైర్యాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.