20 May, 2026 | 5:44 PM

జిల్లాల్లో ఎండ తీవ్ర‌తపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచనలు

20-05-2026 04:22 PM

హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర‌మైన వ‌డ గాలులు, ఎండ తీవ్ర‌త‌పై వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌నున్నందున ఆయా జిల్లాల అధికారులు అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

ఓఆర్ఎస్ ప్యాకెట్లు త‌గిన సంఖ్య‌లో అందుబాటులో ఉంచాల‌ని, తాగు నీరు, విద్యుత్ స‌ర‌ఫ‌రాపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని అధికారులను ఆదేశించారు. ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు మొద‌లు జిల్లా ఆసుప‌త్రుల వ‌ర‌కు వైద్య ఆరోగ్య సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, వ‌డ‌దెబ్బ‌తో ఎవ‌రైనా ఆసుప‌త్రుల్లో చేరితే వెంటనే త‌గిన వైద్య స‌హాయం అందించాల‌ని చెప్పారు.

ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో అవసరమైన మేరకు చ‌లివేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు మ‌ధ్యాహ్న ప్ర‌యాణాలు చేయ‌కుండా ఉండాల‌ని ప్రజలకు సూచించారు. ఆయా జిల్లాల్లో ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ క‌లెక్ట‌ర్ల‌కు దిశానిర్దేశం చేయాల‌ని ముఖ్యమంత్రి తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె. రామ‌కృష్ణారావుని ఆదేశించారు.