12 May, 2026 | 5:03 PM

కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

12-05-2026 04:08 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, మొక్కజొన్న కొనుగోళ్ల పురోగతిపై వివిధ జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిషన్ మోడ్‌లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలని సీఎం కలెక్టర్లకు ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించాను. వివిధ జిల్లాల్లో  ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలను రేవంత్ రెడ్డి కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్స్ కు తరలించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. 

ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్‌ను రేవంత్ ఆదేశించారు. ఎక్కడైనా గోడౌన్స్ సమస్య ఉంటే అలాంటి ప్రాంతాల్లో అవసరాన్నిబట్టి తాత్కాలికంగా రైతుబజార్లు, ఫంక్షన్ హాల్స్‌ను ఎంగేజ్ చేసి ధాన్యాన్ని తరలించాలన్నారు. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్ట్ పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిచిపోయి, రైతులు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం టార్పాలిన్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. 

వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలని, వాతావరణ సూచనలను రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.