12 March, 2026 | 5:50 AM

దానం, కడియంకు క్లీన్‌చిట్

12-03-2026 02:13 AM

వారు పార్టీ మారినట్లు ఆధారాలు లేవు..

  1. అనర్హత పిటిషన్లను కొట్టివేసిన అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ 
  2. నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి) : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ కీలక తీర్పును వెలువరించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే  దానం నాగేందర్, స్టేషన్‌ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. ఆ ఇద్దరూ పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని తీర్పులో పేర్కొన్నారు.  ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వారిద్దరూ బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు.

దీంతో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట లభించినట్లయ్యింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా వీరు పనిచేస్తున్నారని.. వీరి శాసనసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బుధవారం విచారణ చేపట్టారు.

ఈ విచారణలో తాము ఇప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నామని, పార్టీ మారలేదని దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పష్టం చేయడంతో.. అనర్హత పిటిషన్ కొట్టివేశారు. ఇదే అంశంపై గురువారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో ఒక రోజు ముందే తీర్పును వెల్లడించారు.  ఇప్పటికే పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. కేసు మళ్లీ విచారణకు వచ్చేలోగా స్పీకర్ తన నిర్ణయం ప్రకటించాలని సూచించింది.

ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం  తీర్పు వెలువరించారు.  దీంతో ఇప్పటివరకు పార్టీ ఫిరాయిపులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మె ల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని  స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి,  బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎం సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్‌రెడ్డి, టీ ప్రకాష్‌గౌడ్, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీలు ఉన్నారు. 

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందే బీఆర్‌ఎస్ అని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. ఫిరాయింపుల గురించి కేటీఆర్, బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. స్పీకర్ తన అధికార పరిధిలోనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందే బీజేపీ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందనే ప్రజలు ఆశీర్వదిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్ క్షమాపణ చెబితే.. నేను రాజీనామాకు సిద్ధం: కడియం

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వేసిన అనర్హత పిటిషన్ చట్టబద్దం కాదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఎందుకు పిటిషన్ వేయలేదని  ఆయన ప్రశ్నించారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నేతలు ఎంత మందిని చేర్చుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో చేసింది తప్పని భావించి, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెబితే.. ఎమ్మెల్యే పదవికీ రాజీనామ చేసి ఉపఎన్నికకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు కడియం శ్రీహరి  స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ చట్టబద్దం కాదని ఆయన వివరించారు. ఆ పార్టీ తనకు ఎలాం టి నోటీసు ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్ ఎన్నడూ ప్రజలముందుకు వచ్చి ఫిరాయింపుల గురించి మాట్లాడలేదని ఆక్షేపించారు. సభలో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా మని.. కానీ, ఆ పార్టీ నాయకత్వానికి దూరం గా ఉన్నామని తెలిపారు. 

ఫిరాయింపు ఎమ్మెల్యేలను కేసీఆర్ మంత్రులుగా చేయలేదా..? టీడీపీ శాసనసభా పక్షం బీఆర్‌ఎ స్‌లో విలీనం కాకముందే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రిని చేయడం నైతికమా..? అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. రాజకీయంగా తమను ఎదగకుండా చేయడానికే కేసీఆర్ జిల్లాల విభజన చేశారని కడియం శ్రీహరి ఆరోపించారు. ఎంతో చరిత్ర ఉన్న వరంగల్‌ను ఆరు జిల్లాలుగా చేయడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వాన్ని సిద్ధాంతపరంగా విభేదించానని ఎమ్మెల్యే అన్నారు.

మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవ్వడానికే తన స్థానంలో సబితఇం ద్రారెడ్డిని  విద్యా శాఖ మంత్రిని చేశారని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు తాను వ్యతిరేకమని,  అన్ని విషయా లు త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు. ప్రస్తుతం తాను బీఆర్‌ఎస్‌లోనే  ఉన్నానని, నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో  కలిసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. కేసీఆర్‌తో  తనకు సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నాయని చెప్పారు. బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లినా ఎదుర్కొంటానని.. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధీమా వ్యక్తంచేశారు.

ప్రజాస్వామ్య అనే పదాన్ని.. ఉచ్ఛరించడానికి మీకు అర్హత లేదు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ తీర్పుపై కేటీఆర్ తెగ ఎగిరెరిగిర పడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివా స్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి చీకటి రోజని, ప్రజలు తీర్పును అవమానించారంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతు న్నారని ఆయన విమర్శించారు. గురువిం ద కేటీఆర్.. పదేళ్ల మీ పాలనలో నీ కింద ఉన్న నలుపును ఒకసారి చూసుకో అం టూ బుధవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు.

ప్రజాస్వామ్యాన్ని అత్యంత పాశవికంగా హత్య చేసిన చేతులు మీవి’ అంటూ దుయ్యబట్టారు, ప్రతిపక్షాలకు, ప్రజా సం ఘాలకు, ప్రజలకు  మీ పదేళ్ల పాలనలో ప్రతి రోజు చీకటి రోజేనని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు అనే పదం ఉచ్చరిం చడానికి కూడా మీ కుటుంబానికి అర్హత లేదన్నారు. ప్రజాస్వామ్యాని, రాజ్యాంగాన్ని లోక్‌భన్ సాక్షిగా ఖూనీ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఏకంగా మంత్రి పదవులు ఇచ్చింది మీరు కాదా..? అని ప్రశ్నించారు. పదేళ్లలో 39 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు పాల్పపడ్డారని తెలిపా రు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు, చివరకు వార్డు మెంబర్లను కూడా వదిలిపెట్టలేదన్నారు.

ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడటమా?: మంత్రి సీతక్క 

పార్టీ  ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క విమర్శించారు.  బీఆర్‌ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇచ్చిన తీర్పుపై మంత్రి సీతక్క  స్పందించారు. పార్టీ ఫిరాయింపులు గతంలో ఎందుకు జరిగాయనేదా నిపై ముందుగా కేటీఆర్ ప్రజలకు  క్షమాపణలు చెప్పి మాట్లాడాలన్నారు. బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకున్నారని, మండలి చైర్మన్ పదవి లాగేసుకు న్నారని సీతక్క గుర్తు చేశారు.

తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రా రెడ్డిల కు నేరుగా మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ మర్చిపోయారా..?  అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. కేటీఆర్ నీతిమంతుడైనట్టుగా విచిత్రంగా ఉందన్నా రు. స్పీకర్ తన పరిధి మేరకే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ తీసుకుంటే అభివృద్ధి కోసం.. కాంగ్రెస్ తీసు కుంటే ప్రజాస్వామ్యంపై దాడి జరిగిన ట్టా..’ అంటూ మంత్రి మండిపడ్డారు. 

బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటని తేలిపోయింది: దానం

బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. తాను బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎక్కడా పనిచేయలేదని, అంతేకాకుండా ఏ పార్టీలోనూ సభ్యత్వం తీసుకోలేదని చెప్పారు. అసెంబ్లీలో విప్ కూడా జారీచేయలేదని దానం చెప్పారు. అనర్హత పిటిషన్‌ను స్పీకర్ డిస్మిస్ చేయడంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందిస్తూ.. మంగళవారం జరిగిన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీకి తనను ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్‌కు సీఎం మరోసారి కాలేదనే ఇబ్బంది లేదని, కానీ,  కేటీఆర్‌కు మాత్రం  సీఎం పదవి రాలేదని చాలా ఇబ్బందిగా ఉందన్నారు. తాను సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఓడిపోవడానికి బీజేపీ, బీఆర్‌ఎస్ అపవిత్ర కలయికనే కారణమన్నారు. తాను ఎంపీగా గెలిచి ఉంటే ఈ పంచాయతీ ఉండేది కాదన్నారు. ‘నాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా ఉపఎన్నికలకు వెళ్లి గెలిచేవాడిని. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనం కోసం సీఎంపై బురద జల్లుతున్నారు.

ముఖ్యమంత్రి పదవి తమ ఆస్తి అని కొందరు భావిస్తున్నారు. రేవంత్‌రెడ్డి సీఎం కావడం ఏంటని కొందరు బాధపడుతున్నారు. ఆయన ఆశించినట్టే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఉంటాయి’ అని దానం నాగేందర్ పేర్కొన్నారు. ఎంపీగా పోటీ చేయడం తన వ్యక్తిగత విషయమన్నారు.  హైదరాబాద్ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే దానం  తెలిపారు.