25 August, 2026 | 1:18 AM

మణిపూర్‌లో మళ్లీ హింస

25-08-2026 12:23 AM
  1. సేనాపతి జిల్లాలో రెండు వర్గాల మధ్య కాల్పులు
  2. ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు, ఉద్రిక్తత
  3. కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవానుకు గాయాలు

ఇంఫాల్, ఆగస్టు 24: మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. సేనాపతి జిల్లాలో సోమవారం రెండు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా, ఒక సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డారు. ఆయనను చికిత్స కోసం సేనాపతి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జవాన్ పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. కాంగ్‌పోక్పి జిల్లాలోని తాఫౌ కుకీ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు ఓ ఇంటికి నిప్పు పెట్టారు.

అనంతరం ఉదయం 4 గంటల ప్రాంతంలో సేనాపతి జిల్లాలోని నాగా తాఫౌ ప్రాంతంలో పలు ఇళ్లకు నిప్పంటించారు. ఈ ఘటనల తో ఆయా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇళ్ల దహన ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఆందోళనకు దిగారు. సేనాపతి గేట్ వద్ద జాతీయ రహదారి- మొద్దులు, టైర్లను తగులబెట్టి రహదారిని దిగ్బంధించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పకుండా భద్రతా బలగాలను మోహరించారు. ఇళ్లకు నిప్పు పెట్టిన ఘటనను తాఫౌ కుకీ విలేజ్ అథారిటీ తీవ్రంగా ఖండించింది.