1 August, 2026 | 5:07 AM

చవకబారు ఆరోపణలు మానుకోవాలి

01-08-2026 12:00 AM

రవీందర్ సింగ్‌కు సూచించిన నగర డిప్యూటీ మేయర్ 

ముకరంపుర, జూలై 31 (విజయక్రాంతి): ఆరోపణలు చేసే ముందు బీఆర్‌ఎస్ నాయకులు రవిందర్ సింగ్ ఆత్మవిమర్శ చేసుకోవాలని బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు సూచించారు. యూడిఎఫ్ లో అవినీతి కోట్ల రూపాయలు జరిగిందనే అసత్య ఆరోపణల పై ఆయన ఫైర్ అయ్యారు.

కరీంనగర్ లో శుక్రవారం విలేకరుల సమావేశంలో సునీల్ రావు మాట్లాడుతూ రవీందర్ సింగ్ ఆరోపణలు చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. నగర అభివృద్ధి కి సంబంధించి యూడిఎఫ్ స్కీం లో 180 కోట్లకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్,137 కోట్లు ఈసి వ్యాల్యు , అభివృద్ధి పనులు చేసేది 137 కోట్ల తో ఇక ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ఈ పథకానికి సంబంధించి టెండర్లు నిర్వహించి ఆమోదం తెలిపేది రాష్ట్ర ప్రభుత్వం అయితే, ఇందులో  అవినీతి ఏ విధంగా జరిగిందో తెలుపాలని కోరారు. చేసిన అనవసరపు ఆరోపణలకు రవీందర్ సింగ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.మీరు చేసిన ఆరోపణలతో మీ టార్గెట్ బీజేపి, కాంగ్రెస్ కాదని బీఆర్‌ఎస్ పార్టీ యే అని తెలిసిందన్నారు.

5 సంవత్సరాలు మేయర్ గా మరో రెండు సంవత్సరాలు సివిల్ సప్లై చైర్మన్ గా చేశారు.ఎన్ని ఎక్సెస్ టెండర్లు జరిగాయో మీకు తెలియదా అని ప్రశ్నించారు.మీకు ఎమ్మెల్సీ గా అవకాశం ఇవ్వలేదనే కక్షతో మీ పార్టీ పైనే ఆరోపణలు చేస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.మా నాయకులు కేంద్ర మం త్రి బండి సంజయ్‌కి  మీ నాయకుల్లాగా చౌకబారు ఆలోచనలు  ఉండవని స్పష్టం చేశారు.మంత్రి బండి సంజయ్ కుమార్ పై అనవసరపు అసత్య ఆరోపణలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు వొంటెల సత్యనారాయణ రెడ్డి,వంగల పవన్, బండారి వేణు, కొలిపాక శ్రీనివాస్,పొన్నం మొండయ్య, తదితరులు పాల్గొన్నారు.