28 August, 2026 | 2:42 AM

భక్తుల సౌకర్యార్థం వరదవెల్లి దత్తక్షేత్రానికి బోట్ పునఃప్రారంభం

28-08-2026 12:00 AM

బోటును ప్రారంభించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బోట్లో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు

నిత్య పూజలకు బోట్ సౌకర్యం అందుబాటులోకి

బోయినపల్లి ఆగస్టు 27 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయానికి నిత్య పూజలు, భక్తుల దర్శనాల కోసం బోట్ సౌకర్యాన్ని చొప్పదండి శాసనసభ్యులు డా. మేడిపల్లి సత్యం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోట్లో ప్రయాణించి ఆలయానికి చేరుకున్నారు.

అనంతరం శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మిడ్ మానేరు జలాశయం బ్యాక్వాటర్తో ఆలయం చుట్టూ నీరు చేరడంతో భక్తులు దర్శనానికి ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి బోటు సేవలను పునరుద్ధరించారు. గతంలోనూ భక్తుల దర్శనార్థం బోట్ సౌకర్యం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.బోట్ సౌకర్యం పునఃప్రారంభం కావడంతో ఆలయంలో నిత్య పూజలు సక్రమంగా కొనసాగడంతో పాటు స్వామివారిని దర్శించుకునే భక్తులకు ప్రయాణ సౌకర్యం కలగనుంది.

భక్తుల భద్రతకు అవసరమైన లైఫ్ జాకెట్లు తదితర రక్షణ ఏర్పాట్లతో బోట్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రయాణించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాశస్త్యాన్ని, భక్తుల విశ్వాసాలను దృష్టిలో ఉంచుకుని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ సుధాకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సువిన్ యాదవ్, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు రమణారెడ్డి, లక్ష్మీరాజం, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.