21 August, 2026 | 4:11 PM

బాన్సువాడలో ఫీజు బకాయిలపై బీజేవైఎం భారీ ర్యాలీ

21-08-2026 01:53 PM

పెండింగ్‎లో ఉన్న 15వేల కోట్లు ఫీజు బకాయిలను విడుదల చేయాలి

బాన్సువాడ, ఆగస్టు 21 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీరీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా BJYM ఆధ్వర్యంలో బాన్సువాడలో కళాశాల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో BJYM కార్యకర్తలు, వివిధ కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మినారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 15,000 కోట్ల ఫీ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో 40లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని విమర్శించారు. వెంటనే బకాయిలు విడుదల చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో బీజేపీ నాయకులు పైడిమల్ లక్ష్మినారాయణ, శ్రీనివాస్ రెడ్డి, కొనాల గంగారెడ్డి, శంకర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, రాజాసింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.