21 August, 2026 | 2:43 PM

విద్యార్థుల కోసం బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం

21-08-2026 02:02 PM

బాన్సువాడ, ఆగస్టు 21 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పరిసర గ్రామాల నుంచి SRNK డిగ్రీ కళాశాలకు వచ్చే విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేశారు.  బాన్సువాడ బస్టాండులో ఈ ప్రత్యేక బస్సు సర్వీసును పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి స్వయంగా బస్సులో SRNK డిగ్రీ కళాశాల వరకు ప్రయాణించారు. కొల్లూరు, దామరంచ, రైతునగర్, అన్నారం, చించోలి, కిష్టాపూర్, బిర్కూర్, తిమ్మాపూర్, బొమ్మందేవ్‌పల్లి చౌరస్తా తదితర గ్రామాల నుంచి కళాశాలకు వచ్చే విద్యార్థులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఈ నెల 7న తిమ్మాపూర్ వెళ్తున్న సమయంలో విద్యార్థులు పోచారం గారి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి ప్రత్యేక బస్సు నడపాలని ఆదేశించారు. పోచారం సూచనల మేరకు బాన్సువాడ నుంచి కొల్లూరు, దామరంచ, రైతునగర్, అన్నారం, కిష్టాపూర్, బిర్కూర్, తిమ్మాపూర్, బొమ్మందేవ్‌పల్లి చౌరస్తా మీదుగా SRNK డిగ్రీ కళాశాల వరకు ఈ బస్సు నడుస్తుంది. విద్యార్థులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు ఉదయం, సాయంత్రం రెండు వేళలా ఈ సర్వీసును నడపాలని డిపో మేనేజర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్, SRNK డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించిన పోచారం శ్రీనివాసరెడ్డికి విద్యార్థినులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.