29 August, 2026 | 12:21 AM

రక్షాబంధన్ సందర్భంగా 100 చెట్లకు రాఖీలు కట్టిన చిన్నారి ప్రకృతి బ్లెస్సి

28-08-2026 09:59 PM

ఏడేళ్లుగా సోదరుడికంటే ముందే చెట్లకే రాఖీలు

పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక సందేశం

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన చిన్నారి ప్రకృతి బ్లెస్సి (10) రక్షాబంధన్ సందర్భంగా పర్యావరణ ప్రేమను చాటుకుంది.ప్రాణవాయువును అందిస్తూ మన జీవితాలను కాపాడుతున్న చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక సందేశాన్ని అందించింది.పర్యావరణ ప్రేమికుడు ప్రకృతి ప్రకాష్ కుమార్తె అయిన ప్రకృతి బ్లెస్సి, చిన్ననాటి నుంచే తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పర్యావరణ పరిరక్షణలో తనదైన ముద్ర వేస్తోంది.

ఆమె ఇప్పటివరకు ఐ రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడంతో పాటు పద్మశ్రీ వనజీవి హరిత అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం బద్దెనపల్లి గురుకులంలో ఏడో తరగతి చదువుతోంది.గత ఏడేళ్లుగా స్వయంగా కాగితాలతో రాఖీలు తయారు చేసి చెట్లకు కడుతున్న ప్రకృతి బ్లెస్సి, ఈసారి కూడా రెండు రోజుల పాటు శ్రమించి 100 కాగితపు రాఖీలను సిద్ధం చేసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన ఇంటి ఆవరణలో తాను నాటిన చెట్లతో పాటు, హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు రాఖీలు కట్టింది.

అంతేకాకుండా తన తండ్రితో కలిసి విత్తనాలను సేకరించి విత్తన బంతులు (సీడ్ బాల్స్) తయారు చేసి అటవీ ప్రాంతాల్లో వెదజల్లుతూ పర్యావరణ సేవలో భాగస్వామి అవుతోంది.ఈ సందర్భంగా ప్రకృతి బ్లెస్సి మాట్లాడుతూ, “రాఖీ పండుగ అనేది కేవలం సొంత సోదరులకే పరిమితం కాదు. మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం ఉచితంగా ప్రాణవాయువును అందిస్తూ మనలను కాపాడుతున్న చెట్లను కూడా సంరక్షించాలి.అందుకే నా సొంత సోదరుడికంటే ముందే చెట్లకే రాఖీలు కడుతున్నాను. ప్రతి ఒక్కరూ చెట్లకు రాఖీలు కట్టి, వాటిని కాపాడుతామని ప్రతిజ్ఞ చేయాలి” అని పిలుపునిచ్చింది.