18 June, 2026 | 3:58 AM

ఇటుకబట్టీల్లో బాల్యం బందీ

18-06-2026 12:00 AM

కందనెల్లి తండాలో బాల కార్మికుల వెట్టిచాకిరి..

తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

తాండూరు, జూన్ 17 (విజయక్రాంతి): పుస్తకాలు పట్టాల్సిన వయసులో పిల్లలు ఇటుకలు మోస్తున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తండాలో ఉన్న ఇటుక బట్టీల్లో యజమానులు బాల కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని స్థానికుల ఆరోపణ. బాల కార్మిక చట్టం-1986 ప్రకారం 14 ఏళ్ల లోపు పిల్లలను పనుల్లో పెట్టుకోవడం నేరమైనా, ఇక్కడ అది బహిరంగంగానే సాగుతోంది.

మహారాష్ట్ర నుండి వచ్చిన కూలి కుటుంబాల పిల్లలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో మాడిపోతూ, ఇటుకలు, కట్టెలు మోస్తున్నారు. సరైన తిండి లేదు, చదువు లేదు, ఆట-పాటలు అసలే లేవు. ‘రోజుకు 100-150 రూపాయలకు పిల్లలను పనిలో పెట్టుకుంటున్నారు. స్కూల్ మానేసి తల్లిదండ్రులతో పాటు వచ్చి పనిచేస్తున్నారు‘ అని గ్రామస్తులు తెలిపారు. లేబర్ డిపార్ట్మెంట్, చైల్ వెల్ఫేర్ కమిటీ, రెవెన్యూ అధికారులు అందరికీ విషయం తెలిసినా చర్యలు శూన్యం. ‘మాకు కంప్లైంట్ రాలేదు‘ అని ఒకరంటే, ‘మా పరిధి కాదు‘ అని మరొకరు తప్పించుకుంటున్నారు తప్ప, ఒక్క బట్టీ యజమానిపై కూడా కేసు నమోదు చేయలేదని ఆరోపణ. 

బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం పిల్లలను పనుల్లో పెట్టుకుంటే 6 నెలల నుండి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, 20 వేల నుండి 50 వేల వరకు జరిమానా విధించవచ్చు. ఇటుక బట్టీలు ప్రమాదకర పరిశ్రమల జాబితాలో ఉన్నాయి. ఇక్కడ 18 ఏళ్ల లోపు వారిని పనిలో పెట్టుకోవడం పూర్తిగా నిషేధం. ఈ విషయమై పెద్దముల్ తాసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ ను వివరణ  కోరగా ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న చిన్నారులను విముక్తి చేసి యజమానులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.