జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం
వైద్య సేవలకు గుర్తింపుగా లోతువాగు సర్పంచ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
కొత్తగూడెం లక్ష్మిదేవిపల్లి,(విజయక్రాంతి): జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా లోతువాగు గ్రామపంచాయతీ పరిధిలోని గిరిప్రసాద్ నగర్, జయశంకర్ కాలనీలలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆశిష్ జకోటియా ఆధ్వర్యంలో, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి పైగా పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. వైద్య శిబిరం అనంతరం గ్రామ ప్రజలకు నిస్వార్థంగా ఉచిత వైద్య సేవలు అందించినందుకు గుర్తింపుగా, జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా లోతువాగు సర్పంచ్ ఈసం కళ్యాణి ఆధ్వర్యంలో డాక్టర్ ఆశిష్ జకోటియాను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు డాక్టర్ అందించిన సేవలను కొనియాడుతూ, కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం, అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.






