15 August, 2026 | 3:50 AM

కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ చిక్కులకు చెక్

15-08-2026 12:03 AM

18 నుంచి పూర్తిస్థాయిలో వన్ వే విధానం

ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారమే లక్ష్యం 

స్థానిక సంస్థలు సహకరించాలని సిటీ పోలీస్ పిలుపు

బంజారాహిల్స్, ఆగస్టు 14 (విజయక్రాంతి): నగరంలోని కెబిఆర్ పార్క్ చుట్టూ రహదారులు నిత్యం రద్దీగా ఉంటాయి. ము ఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వా హనాల రాకపోకలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 18 నుంచి పూర్తి స్థాయిలో కెబిఆర్ పరిసర ప్రాంతాల్లో వన్ వే అమలు చేయనున్నామని ప్రకటించారు. అందులో భాగంగా ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జో యెల్ డేవిస్, ట్రాఫిక్ డీసీపీ కాజల్ ఆధ్వర్యం లో సమన్వయ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో కెబిఆర్ పార్క్ పరిసరాల్లోని ఆసుపత్రులు, వ్యాపార సంస్థల ప్రతినిధులతో పాటు ఇతర నిపుణులు పాల్గొన్నారు. 

అత్యవసర సేవలకు ఇబ్బంది లేకుండా..

కెబిఆర్ పరిసర ప్రాంతాల్లో ప్రముఖ ఆసుపత్రులు ఉన్నాయి. వాటికి అత్యవసర వైద్య సేవల నిమిత్తం నిత్యం వందలాది ఆంబులెన్సులు రోగులను తీసుకొస్తుంటాయి. ఆ ఆంబులెన్సుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. రోగులు, ఆసుపత్రి సిబ్బంది కూడా సాఫీగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాపార సంస్థల నిర్వాహకులకు కూడా తగిన వెసులుబాట్లు కల్పిస్తామని ట్రాఫిక్ ఉన్నతాధికారులు హామీనిచ్చారు. 

ప్రజల సహకారం తప్పనిసరి

కెబిఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానం విజయవంతంగా అమలు చేసేందుకు ప్రజల సహకారం కూడా తప్పనిసరి అని ట్రాఫిక్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అందుకు వాహనదారులు, స్థానిక సంస్థలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రయాణికులు కూడా ఈ మార్గంలో ముం దస్తు ప్రణాళికతో ప్రయాణించాలని విన్నవించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలన్నారు.

ఇబ్బందుల పరిష్కారం.. మార్పులకు సిద్ధం

ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు వన్ వే విధానం అమలులోకి తెచ్చామని ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ జామ్ లను తగ్గించడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. విధానం అమలులోకి వచ్చిన తరువాత పరిస్థితులకు అనుగుణంగా ప్రజల ఫీడ్ బ్యాక్ ఆధారంగా మార్పులు చేస్తామని ప్రకటించారు.